అత్యాధునిక మిలటరీ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ ప్రకటించారు. జూన్‌లో దీన్ని నింగిలోకి పంపించనున్నట్లు తెలిపారు. అమెరికా సహా ఇతర దేశాల సైనిక కార్యకలాపాలను పసిగట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ మేరకు అధికార వర్కర్స్ పార్టీకి చెందిన సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు రి ప్యొంగ్ చోల్‌ను ఉటంకిస్తూ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ రెండో వారంలో దీన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా మిలటరీ ఆపరేషన్స్ చేపట్టడాన్ని ముందు నుంచి ఉత్తర కొరియా తప్పు పడుతూ వస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని లుజాన్ ఐలండ్స్, లేదా తూర్పు చైనా రీజియన్ నుంచి జూన్ 11వ తేదీలోగా సమాచార శాటిలైట్‌ను ప్రయోగించదలచుకున్నట్లు జపాన్ రక్షణ మంత్రి యసుకజు హమద ప్రకటించని రెండో రోజే- ఉత్తర కొరియా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు దేశాల సైనిక కార్యకలాపాలను పసిగట్టడానికి గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధపడినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఆర్మీ డ్రిల్స్‌ను నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని, దీనిపట్ల తమ అభ్యంతరాన్ని సైతం వ్యక్తం చేశామని రి ప్యొంగ్ పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను దక్షిణ కొరియా బేఖాతర్ చేస్తోందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావొచ్చని హెచ్చరించారు. గత ఏడాది మొత్తంగా 100 అత్యాధునిక క్షిపణి పరీక్షలను నిర్వహించింది ఉత్తర కొరియా. ఇందులో మెజారిటీ సంఖ్యలో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్స్ క్షిపణులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూక్లియర్ మిస్సైల్స్‌ను సైతం విజయవంతంగా పరీక్షించిందా దేశం. జపాన్, దక్షిణ కొరియా సరిహద్దుల్లో వాటిని సంధించింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా అభ్యంతరాలను సైతం పెడచెవిన పెట్టింది.
గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటన
May 30, 2023
0
Tags