ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు రేడియోబావి కూడలిలోని సంగీత ఫ్యాషన్ రెడీమేడ్స్ వస్త్ర దుకాణంలో ఫోన్ పే చేస్తానంటూ ఓ వ్యాపారిని యువకుడు మోసగించాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రమణారెడ్డికి స్థానికంగా వస్త్ర దుకాణం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 25 సంవత్సరాల వయస్సున్న ఓ యువకుడు దుకాణానికి వచ్చాడు. పంచెలు, రుమాళ్లు కొనుగోలు చేస్తానని, తనకు రూ.1 ఫోన్ పే చేస్తే యజమాని చరవాణికి దుస్తులకు సంబంధించిన నగదు మొత్తం పంపిస్తానని కోరాడు. దీంతో యజమాని సూర రమణారెడ్డి తన చరవాణిని ఆ యువకుడికి ఇచ్చారు. ఇదే అదనుగా అందులోని రూ.87,500 నగదును తన ఖాతాకు బదిలీ చేసుకొని, ఇప్పుడే వస్తానని చెప్పి ఉడాయించాడు. నగదు బదిలీ అయినట్లు సందేశం రావడంతో అప్రమత్తమైన యజమాని రమణారెడ్డి వెంటనే గిద్దలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు దుకాణం వద్దకు వచ్చి విచారణ చేపట్టి, ఫోన్‌పే ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని ఎస్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ యువకుడు గిద్దలూరులోని పలు వస్త్ర దుకాణాల్లోకి వెళ్లి యజమానులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించినా, వారెవరూ చరవాణులు ఇవ్వలేదని తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారికి రూ.87,500 టోకరా !
May 27, 2023
0
Tags