నన్నేమీ చేయొద్దని బతిమాలినా కనికరించలేదు !

Telugu Lo Computer
0


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజు సజీవ దహనం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెదురుకుప్పం మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు నాగరాజు(35)ను అతికిరాతకంగా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంచాయితీ పేరుతో రాజీ చేద్దామని పిలిపించిన చాణక్య ప్రతాప్‌, రిపుంజయ అతని అనుచరులు మానవత్వం మరిచి లుంగీతో గొంతు బిగించి అతిదారుణంగా చంపేశారు. ఆపై కార్లో పడేసి సజీవ దహనం చేశారు.  రాజీ పేరుతో నాగరాజు, చాణక్యప్రతాప్‌ సన్నిహితుడు గోపి రంగంలోకి దిగాడు. నాగరాజుకు శనివారం సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత నాగరాజు, చాణక్యప్రతాప్‌, రింపుజయ, గోపితో పాటు మరికొంతమంది చంద్రగిరి సమీపంలోని ఓ వెంచర్‌లో మద్యం సేవించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటలకు అక్కడి నుంచి నాగరాజు కారులో రిపుంజయతో పాటు మరో ఇద్దరు, మరో కారులో చాణక్యప్రతాప్‌తో పాటు ఇంకో ఇద్దరు బ్రాహ్మణపల్లి నుంచి గంగుడుపల్లి కురువకణం వద్దకు బయల్దేరారు. అప్పటికే అక్కడ టీడీపీ బొప్పరాజుపల్లికి చెందిన మరో ముగ్గురు కారులో వచ్చి వేచి ఉన్నారు. కురవకణం వద్దకు చేరుకోగానే రిపుంజయ, చాణక్య పాటు వారి అనుచరులు నాగరాజుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనను వదిలిపెట్టాలని, నన్నేమీ చేయొద్దని నాగరాజు, చాణక్యప్రతాప్‌, రిపుంజయను కాళ్లుపట్టుకుని బతిమలాడాడు. ఈ క్రమంలో నాగరాజు మెడలోని బంగారు గొలుసు, పాదరక్షలు పక్కకు పడిపోయాయి. 10.45 గంటల సమయంలో ముందుగా అనుకున్నట్లే అక్కడ ఉన్న మరో ముగ్గురితో పాటు టీడీపీ నాయకులు నాగరాజు గొంతు లుంగీతో బిగించి చంపేశారు. ఆపై నోటికి ప్లాస్టర్‌ను అతికించి బలవంతంగా కారులో పడేశారు. ఆపై కారును కురవకణం లోయలో పడేసేందుకు యత్నించారు. అయితే కారు ముందు పెద్దరాయి అడ్డుగా ఉండడంతో కారు లోపల, బయట పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ప్రాణాలతో ఉన్న నాగరాజు సజీవ దహనమయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)