యువతిపై ప్రేమోన్మాది దాడి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోరబండ బంజారానగర్‌లో పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగపడ్డాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ప్రేమోన్మాదిని పట్టుకొని కర్రలతో చితకబాధి యువతిని కాపాడారు. తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ రామారావునగర్‌కు చెందిన సిద్ధప్ప, శాంతమ్మల కూతురు లక్ష్మి(25), ప్రస్తుతం బోరబండ మోతీనగర్‌లోని పీఆర్‌నగర్‌లో ఉంటున్న కిశోర్‌ (28)లకు గత 7 సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. గతంలో బోరబండలో కిశోర్‌ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహించేవాడు. అప్పుడు అతడి వద్ద లక్ష్మి పనిచేసేది. ప్రస్తుతం మోతీనగర్‌లోని తన మామయ్యకు చెందిన పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కిశోర్‌ పనిచేస్తుండగా, లక్ష్మి మాదాపూర్‌లోని నోవాటెల్‌లో హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తుంది. ఏడు సంవత్సరాలుగా కిశోర్‌ ప్రేమిస్తున్నానంటూ లక్ష్మి వెంట పడేవాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ వస్తున్నది. అయితే ఇటీవల లక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కస్సుతో పగ పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో లక్ష్మి ఆమె తల్లి శాంతమ్మను తీసుకొని స్కూటిపై వెళ్తుండగా ముందస్తుగా పథకం ప్రకారం కాపుకాసిన కిశోర్‌ బైక్‌తో వెంబడించాడు. బంజారానగర్‌ మెయిన్‌ రోడ్డుకు చేరుకోగానే లక్ష్మి స్కూటీకి తన బైక్‌ను అడ్డుపెట్టి ఆపాడు. కిందకు దిగిన కిశోర్‌ లక్ష్మి కళ్లల్లో కారం చల్లడంతో లక్ష్మి, ఆమె తల్లి శాంతమ్మ కిందపడిపోయారు. వెంటనే కత్తితో లక్ష్మి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. లక్ష్మికి హెల్మెట్‌ ఉండటంతో పాటు ఆమె కిశోర్‌ భారీనుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. యువతిపై దాడిని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. ఓ ఆటో డ్రైవర్‌తో పాటు మరి కొంతమంది స్థానికులు కిశోర్‌ను అడ్డుకున్నారు. పట్టుకొని కర్రలతో దేహశుద్ధి చేశారు. అప్పటికే లక్ష్మి గొంతు కొంత వరకు తెగింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మోతీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)