భాజపా తరఫున ప్రచారం చేయనున్నట్టు సుదీప్‌ వెల్లడి !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బాజపా తరఫున ప్రచారం చేయనున్నట్టు కన్నడ స్టార్‌ సుదీప్‌ వెల్లడించారు. బుధవారం బెంగళూరులో సీఎం బసవరాజ్‌ బొమ్మైతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఈ సందర్భంగా సుదీప్‌ స్పష్టంచేశారు. కష్ట సమయంలో తనకు సీఎం బొమ్మై అండగా నిలిచారని, ఇప్పుడు తాను ఆయనకు మద్దతుగా నిలబడతానన్నారు. భాజపా తరఫున ప్రచారం చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ నుంచీ తాను పోటీ చేయడంలేదన్నారు. సీఎం బొమ్మైతో భేటీ అనంతరం ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం బొమ్మై కు తన మద్దతు ప్రకటించేందుకు వచ్చానన్న సుదీప్‌, సీఎం తన గాడ్‌ ఫాదర్‌లాంటివారన్నారు. బొమ్మైను తాను ప్రేమతో, గౌరవంగా 'మామా' అని పిలుచుకుంటానని, క్లిష్ట సమయంలో ఆయన తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు. బొమ్మైకి మద్దతు ఇస్తున్నానంటే దానర్థం ఆయన సూచించిన వారందరికీ అన్నారు. అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ సుదీప్‌ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదన్నారు. తనకు, తన పార్టీకి మద్దతు ప్రకటించేందుకే ఆయన తనను కలిసేందుకు వచ్చారన్నారు. భాజపాలో చేరతారన్న ఊహాగానాల నడుమ తనకు వచ్చిన బెదిరింపు లేఖ అంశంపైనా స్పందించిన సుదీప్‌, ఆ లేఖ ఎవరు పంపారో తనకు తెలుసని, తగిన రీతిలో బదులిస్తానన్నారు. అలాగే, భాజపా సిద్ధాంతాలతో మీరు ఏకీభవిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిన నటుడు ప్రధాని మోడీ తీసుకున్న కొన్నినిర్ణయాలను తాను పూర్తిగా గౌరవిస్తానన్నారు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి దాంతో సంబంధంలేదన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)