ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకున్నా !

Telugu Lo Computer
0


ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకున్నానని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ శనివారం తెలిపారు. తాను ఎవరికీ అందుబాటులో లేనంటూ మీడియాలో వచ్చిన కథనాలు, ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర అంతటా ప్రయాణించిన కారణంగా తగినంత విశ్రాంతి, నిద్ర లేకపోవడం వల్ల పల్మనరీ ఇరిటేషన్ పెరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు మందులు వేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించారు. 'నేను కూడా మనిషినే. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో మీడియా ఊహాగానాలు చేయడం మానాలి. ఏదైనా వార్తను ప్రచురించే ముందు ధృవీకరించాలి. మేము పబ్లిక్ ఫిగర్స్, కానీ ఈ విధంగా మా పరువు తీయడం తప్పు' అని అన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్‌ పవార్‌ మాట్లాడారు. 2014లో మోదీ డిగ్రీ ఆధారంగానే ప్రజలు ఓటేశారా? అని ప్రశ్నించారు. చరిష్మా వల్లనే ఆయన ఎన్నికల్లో గెలిచినట్లు చెప్పారు. 'ఆయన (మోదీ) తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన డిగ్రీ గురించి అడగడం సరికాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై ఆయనను ప్రశ్నించాలి. ప్రధాన మంత్రి డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు' అని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)