'ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు' నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. ప్లాంటు పరిరక్షణకు సహకరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంగేంట్రం చేసే దిశగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది సంకేతమని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సంగతి పక్కనబెడితే విశాఖ స్టీల్ ప్లాంటుకు తన వంతు చేయూత అందించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న మాట నిజమేనని తెలిసింది. కీలకమైన బిడ్ వేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాంటు నిర్వహణకు మూలధనం, ముడిసరకుల కోసం నిధులు సమకూర్చి, ఉక్కు ఉత్పత్తుల అందజేయడానికి ప్లాంటు నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. బిడ్డింగ్‌లో సింగరేణి గనుల తరఫు ఖనిజాభివృద్ధి శాఖగాని, నీటిపారుదల శాఖ పాల్గొనబోతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించడంతోపాటు, ప్లాంటుకు ఊతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశంపై తెలంగాణ అధికారులు త్వరలో విశాఖ వెళ్లి అందించాల్సిన నిధుల వివరాలను సేకరించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరోపక్క ఈవోఐల బిడ్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొంటుందా లేదా అన్న విషయం తెలియడం లేదు. ఈఓఐలను గత నెల 27 నుంచి పిలుస్తున్నారు. ఈనేపథ్యంలోనే కేటీఆర్ కేంద్రానికి లేఖాస్త్రం సంధించారు. ప్లాంటును ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. కార్మికులకు అండగా నిలవాలని కేసీఆర్ చెప్పారని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. బీజేపీని ఎదుర్కొని ప్లాంటును కాపాడే యోధుడు కేసీఆరేనని ఆయన అన్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా కేంద్రం తులుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం బిడ్ !
April 10, 2023
0
Tags