ప్రధాని పర్యటనకు నిరసనల సెగ ?

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నై విమానాశ్రయంలోని న్యూ ఇంటిగ్రేడెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారంనాడు తమిళనాడు  వస్తున్న నేపథ్యంలో ఆయనకు నిరసనల సెగ ఎదురుకానుందా? మోడీ రాకను వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల శుక్రవారంనాడు నిరసన పోస్టర్లు వెలిసాయి. సామాజిక మాధ్యమాల్లో 'మీమ్‌'లు హోరెత్తాయి. ఈ పరిణామాలతో 'గోబ్యాక్‌ మోడీ' నినాదం తాజాగా ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడు గవర్నర్ రవి చేసిన సంచలన వ్యాఖ్యల ప్రభావం కూడా దీనికి తోడవుతోంది. దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ తమిళనాడులో జీరో అంటూ ఒక ట్విట్టరాటీ గత ఎన్నికల ఫలితాలతో కూడిన మ్యాప్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దానికి GobackModi అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చాడు. ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి మోదీ వస్తుంటే ఆయన జూనియర్ మినిస్టర్ సింధియా చెప్పుల స్టాండులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ మరొకరు విమర్శించారు. 'గో బ్యాక్ మోదీ' నినాదాలు రాసి ఉన్న బెలూన్లను ఎగురవేసేందుకు ఓ ట్విట్టరాటీ సిద్ధపడుతుండగా, బస్టాండ్ ప్రాంతాల్లో గోబ్యాక్‌మోదీ పోస్టర్లు వెలియడం, ఓ స్తంభానికి కట్టిన మోదీ పోస్టర్‌కు చెప్పులదండ వేసిన మరో పోస్టర్.. ఇలా...సామాజిక మాధ్యమాల్లో పలు ఫోటోలు, మీమ్‌లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా 'GobackModi' నినాదం టాప్ ట్రెటింగ్‌లోకి వచ్చింది. మరోవైపు, గోబ్యాక్‌ రవి నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్‌కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్‌ కేంద్రానికి, స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా రేగిన ఆందోళనలను గురువారంనాడు ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్తావిస్తూ, ఆ రెండు ఆందోళనలకు విదేశాల నుంచి నిధులు సమకూరాయని ఆరోపించారు. ఈ రెండు ఆందోళనలకు గతంలో డీఎంకే, దాని మిత్రపక్షాలు పరోక్ష మద్దతునిచ్చాయి. దీంతో డీఎంకే కూటమిని ఇరుకునబెట్టేందుకు గవర్నర్ ప్రయత్నం చేశారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇటీవలే ఆయన తమిళనాడు పేరును 'తమిళగం' అని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో అధికార డీఎంకే సహా తమిళ రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ మీద నిప్పులు చెరిగాయి. ఎట్టకేలకు గవర్నర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు. ప్రధానమంత్రి తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తూ, ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్, వివేకానంద హౌస్, రాజ్‌భవన్, ఐఎన్ఎస్ అడయార్ హెలిపాడ్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన సెక్యూరిటీ ఏర్పాట్లు, తనిఖీలు చేపడుతున్నారు. చెన్నై-కోయంబత్తూరు 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను కూడా సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి మోదీ ప్రారంభించనున్నారు. సాయంత్రం మైలాపూర్‌లో జరిగే శ్రీరామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)