ఆస్తుల్లో వాటా కోసం హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య పిటిషన్ ?

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనాలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో అసలు నిందితుల్ని తేల్చేందుకు, కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఓవైపు సీబీఐ ప్రయత్నిస్తుండగా, తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు వీరికి ఊరటనివ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో పరిణామం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వివేకా రెండో భార్యగా భావిస్తున్న షమీమ్, ఆమె కుమారుడు షహెన్ షా ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. వివేకాకు తాము కూడా వారసులమని, ఆయన ఆస్తుల్లో తమకు కూడా వాటా దక్కాల్సిందేనని కోరుతూ తెలంగాణ హైకోర్టులో షమీమ్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ప్రస్తుతం న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే సోమవారం వివేకా ఆస్తుల్లో వాటా కోరుతూ ఆయన రెండో భార్య షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరిట, తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తన కొడుకు షేక్ షేహాన్ షా కు డీఎన్ఏ టెస్టులు జరిపి వైఎస్ వివేకా వారసుడో కాదో చెక్ చేసుకోవచ్చని ఆమె కోరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహన్ షా కోసం ఏమేం చేశారో బయటపెట్టారు. అలాగే వీరితో ఆస్తులు పంచుకునే విషయంలో మొదటి భార్య కుమార్తె సునీత, ఆమె కుటుంబంతో వచ్చిన విభేదాలు హత్యకు దారి తీసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)