కీరవాణి, చంద్రబోస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమ సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటు నాటు.. పాటకు ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారకుడు రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అని కీరవాణి ప్రశంసించారు. వారు లేకపోతే ఈ పాట లేదని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం వెనుక వారిద్దరి కృషి ఉందని కితాబిచ్చారు. రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ గుడిలో మూల విరాట్టులాంటి వాళ్లని, వారి తరఫున ఉత్సవ విగ్రహాల్లా తాను, చంద్రబోస్ అవార్డులను అందుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ టాలీవుడ్ పెద్దలకు సూచనలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను విశాఖపట్నానికి తరలించదలిస్తే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. తెలంగాణ అనే భేదభావం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలన చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కీరవాణికి గోదావరి నదితో ఎంతో అనుబంధం ఉందని చెల్లుబోయిన చెప్పారు. ఆ నది తరంగాల్లా కీరవాణి సంగీతం ఉవ్వెత్తున ఎగుస్తుంటుందని పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంత జిల్లాలతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఏపీకి చెందిన చాలామంది నటులు, దర్శకులు, టెక్నీషియన్లను టాలీవుడ్ ఆదుకుందని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని తమ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి అన్నారు. ప్రకృతికి నిలయమైన విశాఖపట్నానికి తరలి వస్తే అన్ని రకాల సౌకర్యాలను తమ ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో ఏర్పాటు కావాలి !
April 10, 2023
0
Tags