మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఇవాళ ఉదయం పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం విజయనగర్ కాలనీలోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట హజరు పర్చారు. హత్య కుట్రకు సంబంధించిన కీలక వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున పదిరోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. భాస్కర్‌రెడ్డి అరెస్టు అక్రమమని, రిమాండ్ తిరస్కరించాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. భాస్కర్‌రెడ్డి అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అయినా ఎక్కడా ఆగకుండా సుదీర్గ ప్రయాణంతో సీబీఐ అధికారులు హైదరాబద్ తరలించారని కోర్టుకు తె లిపారు. బీపీ 190కి పైగా ఉన్నట్టు ఉస్మానియా వైద్యులు నివేదించినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి .. భాస్కర్‌రెడ్డికి ఈనెల 29 వరకు ( 14 రోజులు) రిమాండ్ విధించి, చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించారు. భాస్కర్‌రెడ్డిని 10రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి.. భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులకు నోటీసులు జారీ చేశారు. కస్టడీ పిటిషన్‌పై భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ !
April 16, 2023
0
Tags