14 బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు !

Telugu Lo Computer
0


రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి బహిరంగ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని   తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దుయ్యబట్టారు. తాజాగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అసత్యమైన అభిప్రాయాలను వెల్లడించి తన ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా, రాష్ట్ర సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఈ మేరకు  స్టాలిన్‌ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ''ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం శాసనసభలో చేస్తున్న అత్యవసర చట్టాలను, బిల్లులను వెంటనే అంగీకరించకుండా కాలయాపన చేస్తూ గవర్నర్‌గా తన బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం ప్రతిపాదించిన 14 బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. ప్రత్యేకించి ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం బిల్లును కుంటిసాకులు చెప్పి తిరస్కరించారు. మళ్ళీ రెండోమారు శాసనసభలో ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి పంపినా పెండింగ్‌లో ఉంచడం గర్హనీయం. ఆన్‌లైన్‌ రమ్మీ చట్టం చేసే అధికారం ఉందని కేంద్రమంత్రులు సైతం ప్రకటించినా గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదించడం లేదు. ఆన్‌లైన్‌ రమ్మీకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా గవర్నర్‌ కఠిన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. శాసనసభ చేసే బిల్లును తాను పెండింగ్‌లో ఉంచితే ఆ బిల్లుకు తన అంగీకారం లేనట్లే భావించాలంటూ గవర్నర్‌ తాజాగా పేర్కొనటం, అదీ విద్యార్థుల సభలో ప్రకటించడం రహస్య ప్రమాణానికి వ్యతిరేకం. ప్రమాణస్వీకారంలో పాలనాపరమైన విషయాలను బహిరంగ పరచనని ప్రమాణం చేస్తారు. గవర్నర్‌ ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి సాధారణ వ్యక్తిలా సభలో ప్రభుత్వం పంపిన బిల్లులపై తన అభిప్రాయాలను బహిర్గతం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాష్ట్ర ప్రజావాణిని వినిపించే శాసనసభ గౌరవాన్నే కించపరిచేలా రవి వ్యాఖ్యలు చేయడం గవర్నర్‌ పదవికే మచ్చ. ఇకనైనా గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి'' అని స్టాలిన్‌ హితవు పలికారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)