జనాభా పెరగడానికి కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలే కారణమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద ప్రకటన చేశారు. గురువారం హాసన్ జిల్లా బెల్లూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో జోషి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయని, కరెంట్ లేని కారణంగా జనాభా పెరిగిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఉచిత కరెంటు ఇస్తామంటే నమ్ముతారా ? వారి కాలంలో కరెంటు ఇవ్వలేదు. గ్రామాల్లో ఎప్పుడూ కరెంటు ఉండేది కాదు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్లు తక్కువ కరెంటు ఇచ్చేవారు కాబట్టి మన జనాభా పెరిగింది." అని ప్రహ్లాద్ జోషి అన్నారు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కరెంట్ కోతలపై కాంగ్రెస్ ను విమర్శించడం బాగానే ఉంది అయితే దాన్ని దేశ జనాభాతో లింక్ చేయడమే కాస్త అతిగా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రహ్లాద్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు.
జనాభా పెరగడానికి కరెంట్ కోతలే కారణమట !
March 10, 2023
0
Tags