రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ముసాయిదా బిల్లులపై గవర్నర్ వెంటనే సంతకం చేసి ఆమోదించాలనే నియమం లేదని తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తూత్తుకుడి విమానాశ్రయం వద్ద ఆమె విలేఖరులతో మాట్లాడుతూ భారతదేశానికి జీ-20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం కలుగటం భారతీయులంతా గర్వించాల్సిన విషయమన్నారు. జీ-20 ప్రాంతీయ సదస్సులను దేశంలోని పలు నగరాల్లో నిర్వహించే విషయమై చర్చించేందుకు సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుందన్నారు. ఈ నెల తొమ్మిదిన మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్లు, ముఖ్యమంత్రులతో జీ-20 ప్రాంతీయ మహనాడులు నిర్వహించే విషయమై చర్చిస్తారని తమిళిసై వివరించారు. డీఎంకే నేతలు, ఆ పార్టీ ఎంపీలంతా గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తుండటంపై ఆమె వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులపై వెంటనే సంతకాలు చేయాలనే నియమం ఎక్కడా లేదని, ప్రతిబిల్లు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాతే గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అంత మాత్రానికే గవర్నర్‌ను రీకాల్ చేయాలని కోరటం సమంజసం కాదన్నారు. ఆన్‌లైన్ రమ్మీ నిషేధచట్టానికి సంబంధించిన బిల్లుపై కొన్ని అనుమానాలున్న వల్లే ఆయన ప్రభుత్వం నుంచి వివరణలు కోరారని ఆమె చెప్పారు.
బిల్లులపై వెంటనే సంతకాలు చేయాలనే నియమం ఎక్కడా లేదు !
December 05, 2022
0
Tags