అత్యధిక వ్యాధులకు కారణమవుతున్న దోమలను అరికట్టడానికి జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. కేవలం వేలికి ఉంగరం ధరించడం ద్వారా దోమలు దగ్గరకి రాకుండా అడ్డుకోవచ్చని చెప్తున్నారు. త్రీడీలో రూపొందించిన ఈ రింగును మార్టిన్ లూథర్ యూనివర్సిటీ హాలీ - విట్టెన్ బర్గ్ పరిశోధకులు సాధారణ క్రిమి వికర్షకం ఏఆర్ 3535ని ఉపయోగించి నమూనాను అభివృద్ధి చేశారు. ఏఆర్ 3535ని చాలా కాలంగా చర్మంపై స్ప్రే లేదా లోషన్ రూపంలో వినియోగిస్తున్నారని అందుకే తమ ప్రయోగంలో దాన్ని భాగం చేశామని తెలిపారు. చాలా గంటల పాటు దోమల నుంచి రక్షణ కల్పించే సామర్ధ్యం దీనికుందని వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఈ పరిశోధనా పత్రం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌లో ప్రచురితమైంది. వివిధ మార్గాల్లో పదార్ధాల మిశ్రమాన్ని ఉపయోగించి ఈ ప్రత్యేక త్రీడీ ప్రింటింగ్‌ను రెడీ చేశారు. ఈ రసాయనం నిరంతరం ఆరిపోవడం ద్వారా కీటకాలకు అడ్డంకిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉంగరం 37 శరీర డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దోమల వ్యతిరేక ద్రవం వెదజల్లుతుందని వివరించారు. అయితే దీనిని వాస్తవ పరిస్థితుల్లో ఉపయోగించడానికి మరింత సమయం, పరిశోధన అవసరమని స్పష్టం చేశారు.
ఉంగరం పెట్టుకుంటే దోమలు కుట్టవట !
October 13, 2022
0
Tags