పళనిస్వామి కి అన్నాడీఎంకే పగ్గాలు

Telugu Lo Computer
0


అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్‌సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్‌ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్‌ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్‌సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్‌ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్‌ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్‌ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్‌ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్‌సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)