మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉంటున్నారు. ఆ హోటల్ బిల్లు తాము కట్టడం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”ఆ బిల్లులు బీజేపీ లేదా మా ప్రభుత్వం ఎందుకు కడుతుంది? ఆ హోటల్ నుంచి మా ప్రభుత్వానికి జీఎస్టీ వస్తోంది” అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం విషయంలో తమ పాత్ర ఏమీ లేదని హిమంత బిశ్వశర్మ చెప్పారు. ”మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల విషయంలో నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఎవరైనా అతిథులు అసోంకు వస్తే వారు ఇక్కడ సురక్షితంగా ఉండేలా, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము చూస్తాం. రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా నేను ఇదే పని చేస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, రాడిసన్ బ్లూ హోటల్‌కు బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి వస్తుండడానికి ఎటువంటి సంబంధమూ లేదని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేల హోటల్ బిల్ తో మాకు సంబంధంలేదు !
June 26, 2022
0
Tags