అఖిల భారత ఆయుర్వేద మహాసమ్మేళన్‌ ప్రారంభించిన రాష్ట్రపతి

Telugu Lo Computer
0

 

మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని కొలువైన మహాకాళేశ్వరుడిని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆదివారం దర్శించుకున్నారు. హెలీకాప్టర్‌లో ఉజ్జయినికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌, సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలీప్యాడ్‌ నుంచి రాష్ట్రపతి కాళిదాస్‌ అకాడమీకి చేరుకున్నారు. పండిట్‌ సూర్యనారాయణ వ్యాస్‌ సంకుల్‌లో జరిగిన అఖిల భారత ఆయుర్వేద మహాసమ్మేళన్‌ 59వ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పురాతన వైద్య విధానం ఇప్పటికీ ఆయుర్వేదమన్నారు. ఆయుర్వేద సదస్సు ఫలితాలు దేశానికి, ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి అమూల్యమైన వారసత్వం, సంస్థను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో అనేక మంది తమ వంతు సహకారం అందించారన్నారు. ఆయుర్వేదం అంటే యుగ శాస్త్రమని, ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు కూడా ప్రాధాన్యతనిస్తుందన్నారు. నాణ్యత, పరిశోధనలకు సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి అన్నారు. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, అందరూ కలిసి వాటిని అంగీకరించి ముందుకు సాగాలన్నారు. సామాన్య ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన పెరగాలన్నారు. కార్యక్రమంలో ఆయుర్వేద నిపుణులను సన్మానించారు. అనంతరం ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నూతన భవనాన్ని సైతం రాష్ట్రపతి ప్రారంభించారు. ఆ తర్వాత మహాకాళేశ్వరుడి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉజ్జయిని ఎంతో చరిత్ర కలిగిన నగరమన్నారు. ఉజ్జయినితో తనకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించానని, ఇక్కడి వీధులన్నీ తనకు తెలుసునన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)