సిపిఎం సీనియర్ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ కార్యదర్శి శివాజీ పట్నాయక్ (92) మే 23వ తేదీ సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రగాఢ సంతాపం తెలిపింది. శివాజీపట్నాయక్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. ఆయన చాలా చిన్న వయస్సులోనే విద్యార్థి ఉద్యమంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చేరిన కొద్దికాలానికే సిపిఐ రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికయ్యారు. 1964లో పార్టీ చీలిక సమయంలో సిపిఐ (ఎం) ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1972 నుంచి 1990 వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1978లో జరిగిన పార్టీ 10వ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికై 1989 వరకు కొనసాగారు. ఆయన కిసాన్ ఉద్యమంలోనూ, రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనూ పనిచేశారు. ఒడిశాలో సిఐటియు ఏర్పడినప్పుడు ఆ సంఘం మొదటి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. అలాగే భువనేశ్వర్ స్థానం నుండి ఆయన మూడుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య ప్రతిభ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది.
సిపిఎం సీనియర్ నేత శివాజీ పట్నాయక్ కన్నుమూత
May 24, 2022
0