ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన రాజనాల మురళీకృష్ణ (54), ఊర్మిళాదేవి (42) తమ కుమారుడు గుణశేఖర్‌ను విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాలలో చేర్పించేందుకు ఆదివారం కారులో వెళ్లారు. తిరుగి వస్తుండగా గోపాలపురం శివారులోని పాత నూనె మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీట్లో ఉన్న కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని రాజానగరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీయడానికి గ్యాస్‌ కట్టర్, గడ్డపారలు వినియోగించి గంట పాటు శ్రమించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. మురళీకృష్ణ 29 సంవత్సరాల కిందట కొయ్యలగూడెం మండలం యర్రంపేట నుంచి జీవనోపాధి కోసం బుట్టాయగూడెం వచ్చారు. అప్పటి నుంచి ఔషధ దుకాణం నిర్వహిస్తూ ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. 26 ఏళ్ల కిందట తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఊర్మిళాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఉచితంగా వైద్యం చేస్తూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ధ్రువదత్తా చెన్నైలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. చిన్న కుమారుడు గుణశేఖర్‌ విశాఖపట్నం ఆంధ్రా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)