ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన బిజీగా సాగనుంది. సీఎం జగన్ ఈ రోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హైటెక్స్ చేరుకుంటారు. సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు సైతం హాజరవుతున్నారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లోనే బొత్సా కుమారుడి వివాహ నిశ్చితార్దం జరిగింది. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కేవీపీ, శైలజానాద్ తో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు..మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. వివాహ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారైంది. సుదీర్ఘ కాలం తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా.. వైసీపీ అధినేతగా జగన్ అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయం నుంచి తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి నుంచే క్యాంపు కార్యాలయంగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం అయిన తరువాత ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లలేదు. ఇక, తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల..లోటస్ పాండ్ కేంద్రంగానే తన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
No title
February 11, 2022
0