ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని తిలకించేందుకు బారులు దీరారు. యజ్ఞమహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రవచనశాలలో జీయర్‌స్వాముల ప్రవచనాలు విని తరించారు. ఐదోరోజు వేద ప్రధాన యాగశాలలో పరమేష్టి, వైభవేష్టి యాగాలు జరిగాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించారు. సింహాచలం వేదపండితులు, టీపీ రాఘవాచార్యులు రామానుజ వైభవం ప్రవచన కార్యాక్రమాలను నిర్వహించారు. యాగశాల ఎదుట తలకొండపల్లికి చెందిన 28మంది కళాకారులు చేసిన చిడతల భజన ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కళాకారులు పెద రామానుజాచార్యులను కీర్తిస్తూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వంటకాలు సరిపోక భరద్వాజ భోజనశాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ముచ్చింతల్‌కు వచ్చే దారులన్నీ వాహనాల రాకపోకలతో బిజీగా మారాయి. శ్రీరామనగరానికి ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులను నడిపించారు. ఆశ్రమానికి వచ్చిపోయే భక్తులతో బస్టాండ్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు జస్టిస్ పొనగంటి నవీన్‌రావు, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ముచ్చింతల్‌కు వచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు. మనుషులందరిలోనూ భగవంతుడున్నాడని.. ఇది గుర్తించి నడుచుకునే వారే మంచి మనుషులవుతారని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. 'దివ్యక్షేత్రం'లో ఆదివారం ఆయన మాట్లాడారు. రాముడు... దేవుడా? మనిషా? అనే సందేహాలు కొందరిలో ఉన్నాయన్నారు. రాముడు మనిషి రూపంలోని దేవుడేనన్నారు. మనుషులందరిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పారు. మనలోపల ఉండే దేవుడు ఆయన తత్వంతో మనల్ని నడిపిస్తాడని.. అదిలేని రోజు ఈ లోకాన్నే విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. మన దేహం దేవుని ఇల్లు అని.. ఇది గుర్తించిన వారు మంచి మనుషులవుతారన్నారు. మన గ్రంథాలు, ఇతిహాసాలు, ధర్మాలు, పురాణాల గురించి మనం తెలుసుకోవాలి.. మన పిల్లలకు చిన్నవయసులోనే నేర్పాలని చినజీయర్ స్వామి సూచించారు.
ముచ్చింతల్‌లో భక్తజన సంద్రం!
February 07, 2022
0
Tags