ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన అత్యవరస పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించి విచారించింది ఏపీ హైకోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మథరావు బెంచ్ పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ, పెన్ డౌన్, సమ్మెపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది. ఈ సూచనలు ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఇబ్బంది కలిగించే పరిణామాలే.. ఓ వైపు కోర్టు సూచనలు.. మరోవైపు ఫిట్ మెంట్ లో ప్రభుత్వం స్వల్ప సవరణలు చేసేందుకు రెడీ అవ్వడంతో ఉద్యోగ సంఘాలు సమ్మె నుంచి వెనక్కు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అధికారిక నిర్ణయం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. అయితే పెన్ డౌన్ అయినా సమ్మె అయినా.. అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్ 4 కింద నిషేధం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? అని హైకోర్టు అడిగింది. పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేకపోతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. కాగా, గురువారం విజయవాడలో జరిగిన ర్యాలీపైనా కోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏజీ తెలిపారు. ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం చూడాలి కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది.
సహాయనిరాకరణపై చర్యలు తీసుకోవచ్చు
February 05, 2022
0
Tags