అమరావతిలో 480 ఎకరాలు తనఖా?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.శనివారం మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేసినప్పటికీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించినట్టు సమాచారం. అనంతవరం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో రైతులు భూసమీకరణలో ఇచ్చిన భూమిలో సీఆర్‌డీఏ వాటాకు వచ్చిన భూమిలో కొంత బ్యాంకులకు తనఖా పెట్టినట్టు తెలిసింది. రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఈ భూమిని బ్యాంకులకు తనఖా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు? ఏ అవసరానికి తీసుకుంటున్నారు? అన్న విషయంలో స్పష్టత లేదు. వివరాల కోసం సీఆర్‌డీఏ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులోకి రాలేదు. రిజిస్ట్రేషన్‌ జరిగింది వాస్తవమేనని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ధ్రువీకరిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి రాజధానిలో ప్రస్తుతం స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువల వివరాలను తెప్పించుకున్నట్టు తెలిసింది. బ్యాంకులకు తనఖా పెట్టిన భూముల్లో సర్వేచేసి మార్కింగ్‌ కూడా చేశారని సమాచారం. ఇప్పుడు సీఆర్‌డీఏ తీసుకుంటోంది పూర్తిగా కొత్త రుణమా? లేదా గతంలో హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఇప్పుడు ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కోసం కేటాయించినందున దాన్ని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా మరో భూమిని తనఖా పెట్టిందా? అన్నది తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)