ట్యాక్సీడ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న వైట్‌ ప్లేట్‌ ట్యాక్సీలు ?

Telugu Lo Computer
0


కార్లకు నెంబర్‌ ప్లేట్‌ యెల్లో కలర్‌లో ఉంటే ప్రయాణికుల రాకపోకలు, వైట్‌ కలర్‌లో ఉంటే సొంత వాహనమని అర్థం. ఇప్పుడు వైట్‌ కలర్‌ ప్లేట్‌ వాహనాలు కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ట్యాక్సీడ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. సొంత వాహనాలు కలిగిన యజమానులు ప్రయాణికుల వద్ద డబ్బులు తీసుకుని ట్రిప్స్‌ కొడుతున్నారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 1.86 లక్షల మంది ట్యాక్సీ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33వేల మంది ఐటీ రంగాన్ని నమ్ముకుని రైడ్స్‌ చేస్తున్నారు. మరో 28 వేల మంది టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌పై ట్రిప్స్‌ కొడుతున్నారు. ఇప్పుడు కరోనా వెంటాడుతున్న కారణంగా డ్రైవర్లు ఈ రంగం నుంచి బయటకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పండుగల సమయంలోనూ వారి గిరాకీని వైట్‌ కలర్‌ ప్లేట్‌ వాహనాలు తన్నుకుపోతున్నాయి. ఆర్టీఏ అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడంతో వైట్‌కలర్‌ ప్లేట్‌ వాహనాల మోసాలు కొనసాగుతున్నాయని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు అడ్డాల మీద ప్రయాణికులను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కించుకుని తీసుకెళుతున్నారని చెబుతున్నారు. అట్లాంటి వాహనాల్లో ప్రయాణాలు చేస్తే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా వర్తించదని చెప్పారు. ట్యాక్సీ వాహనం.. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌.. ఇన్సూరెన్స్‌, బార్డర్‌ ట్యాక్సీ, ప్రొఫెషనల్‌ డ్రైవర్‌.. రోడ్డు నిబంధనలపై అవగాహన తదితర ఆర్టీఏ నిబంధనలకనుగుణంగా ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్‌, ప్రభుత్వ సాయం తదితరవి అందుతాయి. వీరికి బిజినెస్‌ ఎక్కువగా జరిగితే పరోక్షంగా వారు చెల్లించే ట్యాక్సీలతో ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండానే వైట్‌ కలర్‌ ప్లేట్‌ వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)