ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగ ఇంకా రెండు మూడు రోజులు నుంచే హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. జనమంతా పల్లెటూర్ల బాటపడతారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు హైవేలు కార్లతో కిక్కిరిసి పోయే దృశ్యాలు మనం ప్రతి ఏటా చూస్తూ ఉంటాం. తద్వారా రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలలో భారీ రద్దీ నెలకొంటుంది. పండుగను జరుపుకోవడానికి వేలాది మంది ఆర్టీసీ బస్సులతో పాటు తమ సొంత వాహానాల్లో సొంతూర్ల బాటపడతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారుల టోల్స్ అన్ని రద్దీగా మారాయి. ఫలితంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పండగ సమయంలో టోల్ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. పండగకు ముందు హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లడం.. పండగ ముగిసిన తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడంతో ఆ నాలుగైదు రోజులు టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మధ్య టోల్ లావాదేవీలు గతంలో ఎన్నాడు లేని విధంగా పెరిగాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో టోల్ ప్లాజాల ఆదాయం పెరిగింది. మూడు రోజుల పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలు 7.55 లక్షల లావాదేవీలు నిర్వహించగా గత ఏడాది ఇది 6.26 లక్షల లావాదేవీలు జరిగాయి. అన్ని జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల్లో 3.78 లక్షల లావాదేవీలు జరిగాయి. టోల్ ప్లాజాల ద్వారా ఈసారి మొత్తం రూ.11.72 కోట్ల ఆదాయం సమకూరగా, 2021లో రూ.9.49 కోట్లు వచ్చినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పండగ సమయంలో ఫాస్టాగ్ వినియోగించిన వారి సంఖ్య 97.36 శాతానికి పెరిగింది. గతేడాది ఫాస్టాగ్ వినియోగం రూ.81.36 శాతం మాత్రమే ఉంది.
సంక్రాంతి సీజన్ లో టోల్ ప్లాజాల పంట పండింది !
January 20, 2022
0
Tags