అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కుందుజ్ రాష్ట్రంలో ఓ మసీదులో భారీ విస్పోటం సంభవించింది. శుక్రవారం కావడంతో జనం పెద్ద ఎత్తున ప్రార్థనలకు రాగా, ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో జరిగింది. ఖాన్ అబాద్ ప్రాంతంలోని షియాల మసీదును టార్గెట్ చేసుకుని, ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, దీనికి బాధ్యులు ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. కుందుజ్ లోని ఖాన్ అబాద్ మసీదులో పేలుళ్ల ఘటనపై తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ స్పందించారు. షియాల మసీదు లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టాయన్నారు.