బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు తెలుగు సినిమా కథానాయకుడు.ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు. నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించారు.1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించారు.సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించారు.చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన, నాగు సినిమాలో తండ్రి పాత్ర పోషించారు. ఈయన 1989, నవంబర్ 1 న మరణించారు.