కోరితే తగిన భద్రత కల్పిస్తాం
June 12, 2021
0
కొవిషీల్డ్ను తయారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సిఇఒ అదర్ పూనావాలా కోరితే తగిన భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. దీంతో పూనావాలాకు మరింత భద్రత కల్పించాలన్న పిల్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా, పూనావాలాకు ఇప్పటికే కేంద్రం 'వై' కేటగిరీ సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి బెదిరింపులు ఎదుర్కొంటుండటంతో ఆయనకు 'జడ్ ప్లస్' భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దత్తా మానె ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్.ఎస్.షిండే, జస్టిస్ ఎన్.జె.జమాదార్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ థాకరే సమాధానం ఇచ్చారు. 'ఇవి వ్యక్తిగత వ్యవహారాలు. మీరు ఎవరి కోసం ఈ పిటిషన్ వేశారో ఆ వ్యక్తికి అసలు పిటిషన్ విషయమే తెలియకపోవచ్చు. ఒకవేళ రేపు అతను నాకు ఎలాంటి భయం లేదు, ఏ భద్రతా అక్కరలేదంటే ఎలా? కోర్టు వ్యక్తుల వెనుక పరుగులు తీసి, ఉత్తర్వులు జారీ చేయదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.