బీర్ ఫ్రీ !
June 04, 2021
0
టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనేక చర్యలు చేపడుతున్నారు. అమెరికా స్వాంత్రదినోత్సవం (జులై 4) నాటికల్లా దేశంలోని పెద్దల్లో 70 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అయినా అందించాలని జో బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన జూన్ నెలను ‘ప్రత్యక్ష కార్యాచరణ నెల’గా ప్రకటిస్తూ.. పెద్దలందరూ టీకా వేసుకోవాలని వివిధ వేదికల ద్వారా పిలుపునిస్తున్నారు. అయితే ప్రముఖ బీర్ కంపెనీ ఆన్‌హైసర్ బుష్ అమెరికా ప్రజలు టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు మరో తాయిలం ప్రకటించింది. అధ్యక్షుడు విధించిన లక్ష్యాన్ని ప్రజలు జులై 4 కల్లా సాధిస్తే పెద్దలందరికీ ఉచితంగా ఓ బీర్ అందిస్తామని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుంటున్న అమెరికాకు తామూ పూర్తి స్థాయిలో మద్దతిస్తామని కంపెనీ సీఈఓ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక తాజా లెక్కల ప్రకారం, అమెరికాలోని పెద్దల్లో ఇప్పటివరకూ దాదాపు 63 శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 133.6 మిలియన్ల మందికి పూర్తి స్థాయిలో(రెండు డోసులు) టీకాలు అందాయి. ప్రస్తుతం అక్కడ రోజుకు 6 లక్షల టీకా డోసులను ఇస్తున్నారు.