ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని, అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని, ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) మాత్రమే తినాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది.
అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది.
షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారు మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి.
