నాన్నా నన్ను ఒక్కడినే పంపు నేనేమైనా చిన్నపిల్లాడినా !! కొడుకు గట్టిగా అడిగితే కాదనలేకపోయాడు సత్యమూర్తి !
.
కొడుకుచిన్న పిల్లవాడుగా
ఉన్నప్పటినుంచీ వాడిని వెంటపెట్టుకొని ఎక్కడో ఢిల్లీ నుండి నెల్లూరుదాకా ప్రతి వేసవిసెలవులలో తన తల్లితండ్రులను
చూడటానికి వచ్చేవాడు సత్యమూర్తి !
.
గత పదిహేడేళ్ళుగా
ఇదే ఆనవాయితీ ! నడుస్తున్నది !
.
ఈసారి తానొక్కడే ముందువెళతాను అని పట్టుబట్టాడు
కొడుకు !
.
ఒక్కగానొక్కకొడుకు ఎప్పుడూ ఒంటరిగా పంపలేదు ,కానీ వాడి పట్టుదల చూసిన తరువాత పంపక తప్పలేదు !
.
రిజర్వేషన్ చేయించాడు ! ప్రయాణం రోజు రానే వచ్చింది !
.
భార్యాభర్తలిద్దరు కొడుకును రైలెక్కించడానికి వచ్చారు !
.
ఆ జాగ్రత్త ఈ జాగ్రత్త చెపుతుంటే అబ్బ నాకు తెలుసులే నాన్నా అని కొడుకు విసుక్కుంటున్నా లెక్కపెట్టక రైలుకదలడానికి
ఇంకొక నిముషమున్నదనగా
బోగీలో కొడుకు ఉన్న బెర్తు దగ్గరికి వచ్చి ,నాన్నా ! ప్రయాణంలో ప్రమాదమనిపించి నీకు భయమేసినప్పుడు
ఈ చీటీ విప్పి చూడు నీకు సహాయం దొరుకుతుంది! అని చెప్పి చీటీ జేబులో పెట్టి చకచక వెళ్ళిపోయాడు
సత్యమూర్తి !
.
రైలు బయలుదేరి వేగమందుకుంది ! ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు
"s/o సత్యమూర్తి "మంచి థ్రిల్లింగ్
గా ఉన్నది !
.
ఆగినప్పుడు ఎక్కి దిగే వాళ్ళు బెర్తులమీద నడుం వాల్చే వాళ్ళు ,చంటిపిల్లలతల్లులు పిల్లల అరుపులు కేకలు !
.
ఓహ్ ఒకటేమిటి అన్నీ వింతగా ఉన్నాయి !
.
భోజన సమయమయ్యింది
AC కంపార్ట్మెంట్ గావటం మూలాన ఎక్కడినుండో మంచి మాగాయపచ్చడి వాసన ఘుమఘుమలాడుతూ
వస్తున్నది !అందరూ ప్యాకెట్లు విప్పారు అందరి వంటకాల వాసన కలగలసి అదో గమ్మత్తైన వాతావరణం నెలకొంది బోగీలో ! అమ్మ ఇచ్చిన ప్యాకెట్ విప్పి హాయిగా తినేశాడు !
.
భోజనం చేసి కొందరు పేకాటరాయుళ్ళు ఆట మొదలు పెట్టారు ! జోరుగా సాగుతున్నది కబుర్లు కులాసాగా మొదలయి ఒకళ్ళమీద ఒకరు జోకులు వేసుకుంటున్నారు ....
.
ఏమైందో ఏమో నెమ్మదిగా గొడవ మొదలయ్యింది
అలాఅలా ఒక్కసారే వాతావరణం వేడెక్కి ఒకరినొకరు తన్నుకోవడం మొదలుపెట్టారు !
.
బోగీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
చైనులాగి మరీ ఒకరినొకరు తోసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కొందరువచ్చి
"s/o సత్యమూర్తి "మీద పడ్డారు ఒక్కసారిగా భయమేసింది ! ఇతగాడికి వణికిపోయాడు ! ఏం చేయాలో తోచలేదు !
.
ఇంతలో తండ్రి ఇచ్చిన కాగితం గుర్తుకు వచ్చింది గబగబ విప్పి చూశాడు !
.
నాన్నా! ....
అమ్మా ,నేను A2 లో 6,7 బెర్తులలో ఉన్నాము మా దగ్గరకు రా ! ....అని ఉన్నది ! అంతే ఒక్క గంతులో A1 నుండి A2 కి వెళ్ళిపోయాడు s/oసత్యమూర్తి !
.
మనలను భూలోక ప్రయాణానికి పంపిన ఆ భగవంతుడు ఒంటరిగా పంపాడా ? లేదు ! ఆయన మనతోటే ఉన్నాడు !
.
ఆయనను తలచుకోండి ! భక్తసులభుడు ఇట్టే ప్రత్యక్షమవుతాడు
మన కనులముందు ! ఏ భయమూ మనలను ఏమీ చేయలేదు !
.
ఆయన మనతోటే ఉన్నాడు !
.
(ఒక ఆంగ్ల కధకు స్వేచ్ఛానువాదం )
వూటుకూరు జానకిరామారావు
