హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం ఉదయం 8.28 నిమిషాలకు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తామని అన్నారు. ప్రజాఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ, గంజాయి, డ్రగ్స్ దందా పై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. రోడ్ల పై రవాణా సమయాన్ని తగ్గించి వాహనదారులు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ పోలీసులతో కలిసి శాస్త్రీయ అధ్యయనం చేసి, ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి పౌరుడు సిటిజన్ పోలీసే, వారి చుట్టూ జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల పై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని అసలు వదిలిపెట్టమని హెచ్చరించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్స్‌తో అమాయకులను మోసం చేసే కంపెనీలపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మార్కెట్ ఇంటలిజెన్స్ యూనిట్ ద్వారా చోటుచేసుకుంటున్న మోసాలపై సమాచారం సేకరించి వాటిని అణిచివేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. దర్యాప్తు, విచారణలను సమర్థవంతంగా జరిపి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే ప్రతి వాహనదారుడు నా దృష్టిలో టెర్రరిస్టే కాబట్టి డ్రంకన్ డ్రైవ్‌పై కఠినంగా ఉంటామని సజ్జనార్ హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్ వల్ల చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో చాలా కుటుంబాల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని చెప్పారు. జీఎస్టీ తగ్గడంతో రోడ్ల పై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి మెరుగైన ఫలితాలను సాధిస్తామని అన్నారు. నగరంలో డ్రోన్లను ఉపయోగించి పటిష్ఠమైన పోలీసింగ్‌ను అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. మహిళలు, చిన్నపిల్లల పై అఘాయిత్యాలకు పాల్పడిన, వారిని వేధించిన ఎవరినీ వదిలిపెట్టమని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పోకిరీలు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రతి భవనంలో సీసీ కెమెరాలు ఉండేలా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పారు. సిటీ పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పోలీసు సేవలను అందించే క్రమంలో ఉత్తమంగా పని చేసే ప్రతి సిబ్బందికి రివార్డుతో పాటు గుర్తింపు ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాల పై అవగాహన పెంచుతామని చెప్పారు. ప్రతి ఒక్కరు వారి ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్లతో పాటు కుటుంబ సభ్యులకు డిజిటల్ అరెస్ట్, ఇతర సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని కోరారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలు, ఇతర సమాచారం డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు అందించి హైదరాబాద్ పోలీసులను మీ పోలీసులుగా భావించాలని సీపీ సజ్జనార్ కోరారు.
ప్రతి పౌరుడు సిటిజన్ పోలీసే : హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్
October 01, 2025
0
Tags