హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణానికి పునాది రాయి వేశారు. దసరా సందర్భంగా పూజలు చేసి ఎంఈఐఎల్ డైరెక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత సమయానికి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులకు ఈ ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 12 అంతస్తులతో 2 వేల పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించబోతున్నారు. బేస్‌మెంట్‍లోని రెండు అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ రెండేళ్లలో నిర్మాణం పూర్తయ్యే లక్ష్యంతో పనులను ప్రారంభించారు. నూతన ఆస్పత్రి భవనాల్లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేయబోతున్నారు. రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్ ప్లాంట్ థియేటర్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్‍లను నిర్మించబోతున్నారు. నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ విభాగాలకు ప్రత్యేకంగా కళాశాలలు సిద్ధం చేస్తున్నారు.
నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం
October 03, 2025
0
Tags