ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ను ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు ప్రధాన భాగస్వాములని, వారి బాగోగులు చూడడం తమ బాధ్యత అని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టిందని అన్నారు. గత ప్రభుత్వం వల్ల ఉద్యోగులు కూడా బాధితులైనట్టు పేర్కొన్నారు. పీఆర్సీ గురించి అడుగుతున్నారని, ఆర్థిక పరిస్థితులు భాగా లేవని, దారులన్నీ మూసుకుని పోయాయని, వీలున్నప్పుడు పీఆర్సీ చూస్తామని, అన్నీ కుదిరితే పీఆర్సీ మ్యాటర్ ఆఫ్ డేస్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని హామీలిచ్చారు. డీఏ బకాయిలు: ఉద్యోగులకు రూ.34,000 కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఒక డీఏను వచ్చే నెల (నవంబర్ 1) నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎర్న్‌డ్ లీవ్‌లు: ఎర్న్‌డ్ లీవ్‌లను 50-50 విడతల్లో క్లియర్ చేస్తామని చెప్పారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు: ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల వ్యవస్థను 60 రోజుల్లో స్ట్రీమ్‌లైన్ చేస్తామని తెలిపారు. పోలీసులకు రెండు విడతల్లో సరెండర్ లీవ్‌ల చెల్లింపులు చేస్తామని, రూ.210 కోట్లను జనవరిలోగా అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించిన చంద్రబాబు నాయుడు
October 19, 2025
0
Tags