జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య రంగంలో జీఎస్టీ పన్నుల తగ్గింపుతో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు రూ.1,000 కోట్లు వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదలచేశారు ' గత నెల 21వ తేదీ వరకు 12%, 5% చొప్పున మందులపై జీఎస్టీ ఉండేది 12% కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయి. 12% పన్నును 5%కు కేంద్రం తగ్గించింది. దీనివల్ల ప్రస్తుత మందులపై 7% వరకు పన్ను తగ్గింది. క్యాన్సర్, ఇతర అరుదైన కేటగిరిలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించింది' అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. "రాష్ట్రంలో సుమారు 35 వేల వరకు మందుల దుకాణాలు, 5 వేల వరకు టోకు వర్తక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,250 కోట్ల విలువైన మందులు, సర్టికల్స్ విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం రూ.1,350 కోట్లు వరకు పన్నుల భారం ప్రజలపై పడినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం తెలిపింది. ఇకపై ప్రజలు నేరుగా మందుల కొనుగోలు చేయడంపై పడే జీఎస్టీ భారంలో రూ.703 కోట్ల వరకు ఆర్థిక భారం తగ్గింది. ఇవి కాకుండా క్యాన్సర్, ఇతర అరుదైన మందుల కొనుగోళ్లు రాష్ట్రంలో రూ.112 కోట్ల వరకు ఉంటుందని అంచనా వీటిపై 12% పన్ను పూర్తిగా తొలగించినందున సుమారు రూ.13 కోట్ల వరకు బాధితులకు ఉపశమనం లభిస్తుందని అంచనా. సదరు సంస్థలు ఖరారుచేసే ఎంఆర్పీల్లోనే జీఎస్టీ ఇమిడి ఉంది. తాజాగా 12% జీఎస్టీని 5%కు తగ్గించినందున ఎంఆర్పీ ధర 6% నుంచి 7% వరకు తగ్గింది. ఈ కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయి. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ తరపున 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.679 కోట్లతో మందులు, సర్జికల్ ఐటమ్స్, ఇంప్లాంట్లు, డయాగ్నస్టిక్ కిట్లు, ఇతర వాటిని కొనుగోలుచేశాం. ఇందులో రూ.71 కోట్లు జీఎస్టీ కింద చెల్లిందాం జీఎస్టీ-2.0 కారణంగా ఈ రూ.71 కోట్లులో రూ.40 కోట్లు ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా పరిశీలిస్తే.. ప్రతి ఏడాది జీఎస్టీ సంస్కరణల వల్ల సగటున రూ.250 కోట్లు వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం " అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)