భారత్‌ క్లౌడ్‌ టెక్నాలజీ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి : జీటీఆర్‌ఐ

Telugu Lo Computer
0


భారత దేశం కచ్చితంగా దేశీయ క్లౌడ్‌ టెక్నాలజీ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ హెచ్చరించింది. సొంతంగా తయారు చేస్తున్న సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఆధారిత ఏఐ వంటి అంశాల్లో కూడా స్వయంసమృద్ధి సాధిస్తే అదే అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. భారత్‌ భద్రత, ఆర్థిక వ్యవస్థ.. అమెరికా సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌, సోషల్‌ మీడియాపై తీవ్ర స్థాయిలో ఆధారపడటం ప్రస్తుతం భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య సమస్యాత్మకమని జీటీఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. అతిగా ఆధారపడటం వల్ల.. హఠాత్తుగా సేవలు లేదా డేటా నిలిపివేత ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుందని గుర్తు చేసింది. ''అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ల వంటి షాక్‌లను భారత్‌ ఎదుర్కొంటోంది. కానీ, దీనిని లోతుగా పరిశీలిస్తే.. డిజిటల్‌ అవసరాల కోసం అమెరికా టెక్నాలజీ సంస్థలపై ఆధారపడటం వల్ల వచ్చే ముప్పే తీవ్రమైందిగా కనిపిస్తోంది. ఒక వేళ అమెరికా వాటిని నిలిపివేయాలని ఆదేశిస్తే మాత్రం డిజిటల్‌ పేమెంట్లు, ట్యాక్స్‌ ఫైలింగ్స్‌ తీవ్రంగా ప్రభావితం అవుతాయి'' అని పేర్కొంది. భారత ఫోన్లు, కంప్యూటర్లు, రక్షణ పరికరాలు, ప్రభుత్వ అప్లికేషన్లు అత్యధికంగా అగ్రరాజ్య సిస్టమ్స్‌ ఆధారంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది. భారత ప్రభుత్వం కచ్చితంగా 2030 నాటికి పూర్తిచేసేలా డిజిటల్‌ స్వరాజ్‌ మిషన్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉందిని తెలిపింది. నాటి కల్లా సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా వ్యవస్థలను సృష్టించుకోవాలని పేర్కొంది. చైనా, ఐరోపాలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయని గుర్తు చేసింది. టెక్‌ సార్వభౌమత్వ సాధనలో భారత్‌ వెనకబడిపోతోందని తెలిపింది. భారత్‌ వద్ద ఉన్న అతిపెద్ద బలం ప్రజల డేటా అని దానిని వాణిజ్య చర్చల్లో పణంగా పెట్టకూడదని నివేదిక పేర్కొంది. భారత్‌లోని భారీగా ఉన్న వినియోగదారుల డేటా అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ, దానిమీద వచ్చే ఆదాయాలకు ఇంధనంగా మారుతుందని చెప్పింది. ఇది చమురు, రేర్‌ఎర్త్‌ మెటీరియల్‌ వలే భారత్‌కు వ్యూహాత్మక ఆస్తిగా అభివర్ణించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)