యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ లేఆఫ్స్ పై దృష్టి సారించింది. ఉద్యోగాలను తగ్గించుకోవడంతో పాటు తన పోర్ట్‌ఫోలియోలోని కొన్ని విభాగాల నుండి కూడా నిష్క్రమించనుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగిస్తుందనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఐటీ రంగంపై పెరుగుతున్న ఒత్తిడికి అద్దం పట్టినట్టయింది. ఈ విషయాన్ని యాక్సెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలీ స్వీట్ స్వయంగా వెల్లడించారు. సంస్థకు అవసరమైన నైపుణ్యాల కోసం శిక్షణ ఇవ్వడం సాధ్యం కాని ఉద్యోగులను తొలగించబోతోన్నామని తెలిపారు. ఎంతమందిని తొలగిస్తారనే విషయాన్ని ఆమె వెల్లడించనప్పటికీ దాదాపుగా 9,000 నుంచి 10,000 మంది వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు 7,000 మందిని యాక్సెంచర్ తొలగించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో పని చేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,70,000కు పడిపోయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో యాక్సెంచర్ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ- వృద్ధి మందగించడం, కస్టమర్ల డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పునర్వ్యవస్థీకరణ నిర్ణయానికి వచ్చింది. AI-ఆధారిత డిమాండ్ కొన్ని చోట్ల బలంగా ఉన్నప్పటికీ, మార్కెట్ లో తమ పోర్ట్ ఫోలియోలకు సంబంధించిన మొత్తం వృద్ధి మందగిస్తోందని స్వీట్ పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో యాక్సెంచర్ ఆదాయం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేస్తోన్నట్లు జూలీ స్వీట్ తెలిపారు. ఇది గత సంవత్సరం కంటే చాలా తక్కువ. గత ఏడాది ఏడు శాతం వృద్ధి రేటును అందుకుంది యాక్సెంచర్. ఇప్పుడుదీన్ని అందుకోలేకపోవచ్చని చెబుతోంది.
యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో లేఆఫ్స్ : పోర్ట్‌ఫోలియోలోని కొన్ని విభాగాల నుండి నిష్క్రమణ
September 26, 2025
0
Tags