గోవాలోని పర్యాటక విధానాన్ని అధ్యయనం చేసి గోవా నమూనాను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ వేదికగా నేడు వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని శాసనసభలో వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్, ఏపీ పర్యాటక ప్రగతిని సభకు వివరించారు. గత శాసనసభ సమావేశాల్లో పర్యాటకాభివృద్ధి గురించి చెప్పిన మాటలను ఇప్పటికే 50 శాతం చేతల్లో చూపించామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. విభిన్న పర్యాటక ప్రక్రియలతో సమగ్ర పర్యటకాభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు. 15 నెలల్లోనే 103 సంస్థలతో ఎంవోయూలు, రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల ద్వారా రూ.441 కోట్ల నిధులు రాబట్టామని ఆయన స్పష్టం చేశారు. చీరాల సముద్ర తీర పర్యాటకాన్ని ప్రోత్సాహించి, అభివృద్ధి తీసుకునేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవంతమైన గోవా నమూనాను స్ఫూర్తిగా తీసుకొని చీరాలలో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నట్టు ఆయన తెలిపారు. చీరాల బీచ్ అభివృద్ధి చేయటానికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు. చారిత్రక ప్రదేశాలైన మోటుపల్లి, పురాతన వీరభద్రస్వామి గుడిని ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపొందించిన ప్రణాళికల వివరాలు, చీరాల సమీప ప్రాంతాల్లోని బీచ్ ల్లో రహదారి అనుసంధానత మౌలిక సౌకర్యాల మెరుగుకు తీసుకున్న ప్రణాళికలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల నుండి పర్యాటకులను ఆకర్షించుటకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సభలో వెల్లడించారు. చీరాల బీచ్ ప్రాంతాన్ని గోవా నమూనాతో అభివృద్ధి చేస్తామని చెప్పిన మంత్రి సమాధానం పట్ల చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో విజయవంతమైన గోవా పర్యటకాన్ని అధ్యయనం చేసి ఆ నమూనాను ఏపీలో అమలు చేసేలా, తద్వారా పర్యాటక ఆదాయం పెంపొందేలా చర్యలు తీసుకొనేందుకు కమిటీ వేయాలని మంత్రి దుర్గేష్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించగా, అమలు చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
గోవా నమూనాను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి ప్లాన్ !
September 27, 2025
0
Tags