బెంగళూరులోని విప్రో క్యాంపస్ లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరూతూ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ రద్దీ 30శాతం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది మొత్తంలో వాహనాలను అనుమతించినా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు. ఐటీ సంస్థలకు నెలవైన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంపై ప్రయాణికులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై 'బ్లాక్ బక్' అనే కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 'గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం' అంటూ రాజేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నేతలు సైతం స్పందిస్తుండడంతో రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో గుంతల రోడ్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరులోని అన్ని రహదారులపై మరమ్మతులు చేయడానికి అధికారులకు నెల రోజుల గడువు విధించారు. గడువు లోపు పనులు పూర్తి చేయకపోతే చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు.
విప్రో క్యాంపస్ లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరూతూ అజీమ్ ప్రేమ్‌జీకి సిద్ధరామయ్య లేఖ !
September 23, 2025
0
Tags