ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి బదిలీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసుల వద్ద ఉన్న బాధ్యతలు పూర్తిగా సీబీఐకి మారనున్నాయి. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. సుగాలి ప్రీతి ఘటన 2017 ఆగస్టు నెలలో జరిగింది. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న ప్రీతి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మొదట ఇది ఆత్మహత్యగా నమోదు చేసినా.. కుటుంబ సభ్యులు మాత్రం స్కూల్ యాజమాన్యం అత్యాచారం చేసి, తమ కూతుర్ని హత్య చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వెంటనే కేసు నమోదు అయ్యింది కానీ, దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ కేసు ఏళ్లుగా విచారణలో ఉన్నప్పటికీ, స్పష్టత రాకపోవడంతో అనుమానాలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని వివిధ సంఘాలు, విద్యార్థి సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూడా గొంతెత్తాయి. కర్నూలు సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ర్యాలీలు, నిరసనలు జరిగాయి. అయితే ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించారని చెప్పాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కాలంలోనే ఆయన కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించి, సభ పెట్టి, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఈ కేసు న్యాయాన్ని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని నెరవేర్చుతూ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. పవన్ ఇప్పటికే సీఐడీ అధికారులతో చర్చలు జరిపి, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా పలు సూచనలు కూడా చేశారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమయంలో కూడా ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37 జారీ చేసింది. అయితే, తరువాతి కాలంలో ఎలాంటి పురోగతి జరగక, కేసు మరుగున పడిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కేసు మళ్లీ ఫుల్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇక ఇప్పటికే సుగాలి ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, పలు బెనిఫిట్స్ అందజేసింది. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం నిజమైన న్యాయం జరగాలని, అసలు నిందితులను శిక్షించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సీబీఐ విచారణతో తమకు నిజమైన న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సుగాలీ ప్రీతి కేసు సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ
September 26, 2025
0
Tags