రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు : భక్తుల కోసం ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు పంపిణీ

Telugu Lo Computer
0


రేపటి నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది భక్తుల కోసం ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే శ్రీవారి ఆనంద నిలయంతో సహా ఆలయ ప్రాంగణ పరిసరాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ రకరకాల పుష్పాలతో విద్యుత్ దీపాల కాంతులతో భక్తులకు కనువిందు చేయనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ఈ తొమ్మిది రోజులు ఉదయం, రాత్రి జరిగే వాహన సేవలను దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడూ కోరుకుంటారు. ఉభయ దేవేరులతో మలయప్పస్వామి వారు దాదాపు 16 వాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తూ లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన సేవలను దర్శించుకోవడానికి మాడవీధుల్లోని మూలల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల సమయంలో 35 వేల మంది భక్తులు రీఫిల్లింగ్‌ ద్వారా దర్శనం చేసుకునే వీలుని కల్పించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు మాడ వీధుల బయట భక్తులు ఈ వాహన సేవలను చూసేందుకు వీలుగా 36 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రివిలేజ్‌ దర్శనాలను రద్దు చేసింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వాహన సేవల సమయంతో పాటు వివిధ సమయంల్లో సాంస్కృతిక ప్రదర్శనలను ఇచ్చేందుకు దేశంలోని  29 రాష్ట్రాల నుంచి 229 కళాబృందాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే భక్తులకు సేవ చేసేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులు తొమ్మిది రోజుల పాటు అందుబాటులో ఉండనున్నారు. తిరుమల కొండపైన ప్రతి నాలుగు నిమిషాలకు ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు వెళ్ళే వీలుని కల్పించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా మూడు వేల సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. అంతేకాదు రెండు వేల మంది సెక్యూరిటీ, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్‌ అధికారులతో భద్రతను ఏర్పాటు చేశారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకూ అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. తిరుపతిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య విధులు పర్యవేక్షించే అధికారులు, పనిచేసే సిబ్బందిని అందులో మ్యాపింగ్‌ చేస్తారు. భక్తుల ఫీడ్‌బ్యాక్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. తిరుమల క్షేత్రంలో భక్తులు తమ పాదరక్షలను భద్రపరుచుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)