E20 పెట్రోల్‌ వాడకంపై ప్రజలలో భయాందోళనలు

Telugu Lo Computer
0


దేశంలో ఇంధన భద్రతను పెంచడానికి దిగుమతులను తగ్గించడానికి, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది  20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన మిశ్రమ ఇంధనం. అయితే వాహన యజమానుల్లో ఈ కొత్త ఇంధనం వల్ల తమ వాహనాలకు ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వం ఈ ఇంధనం సురక్షితమని భరోసా ఇస్తున్నప్పటికీ 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వ వాదనలకు భిన్నంగా ఉన్నాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో దేశవ్యాప్తంగా 331 జిల్లాలకు చెందిన 37 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్య విషయాలు ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న 2022కి ముందు తయారైన పెట్రోల్ కార్ల యజమానుల్లో 28 శాతం మంది E20 పెట్రోల్ వాడటం మొదలుపెట్టిన తర్వాత తమ వాహనాలకు ఎక్కువగా మరమ్మతులు అవసరమయ్యాయని తెలిపారు. ఈ సమస్యలు ముఖ్యంగా ఇంజిన్, ఫ్యూయల్ లైన్, ఫ్యూయల్ ట్యాంక్, కార్బ్యురేటర్ వంటి ముఖ్య భాగాలలో కనిపించాయి. ఈ సర్వేలో పాల్గొన్న వాహనాదారుల్లో రెండు వంతుల మంది E20 పెట్రోల్‌కు మారిన తర్వాత తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిందని తెలిపారు. దీని వల్ల ఇంధనంపై, వాహన నిర్వహణపై ఖర్చు పెరిగింది. ఈ సర్వే ప్రకారం 52 శాతం మంది ప్రజలు E20 పెట్రోల్ ధరను కనీసం 20 శాతం తగ్గిస్తేనే దాన్ని ఆమోదిస్తామని, అలాగే E10 లేదా సాధారణ పెట్రోల్ వంటి ఇతర ఇంధనాలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలోని చాలా పెట్రోల్ పంపుల్లో E20 పెట్రోల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ పంపుల్లో కేవలం E20 ఇంధనం మాత్రమే లభిస్తుందని, ప్రస్తుతం వేరే మిశ్రమ ఇంధనాలు అమ్మే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)