ఢిల్లీలో మైనర్ బాలుడు కారు నడిపి ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. కారు ఆపని ఆ బాలుడు కింద పడిన వ్యక్తిని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.32 ఏళ్ల సుజీత్ మండల్, బద్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని పీవీసీ పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పని తర్వాత నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్ (ఎన్డీపీఎల్) కార్యాలయం సమీపంలో ఎర్ర రంగు కారు దూసుకువచ్చింది. నడిచి వెళ్తున్న సుజీత్‌ను అది ఢీకొట్టింది. దీంతో అతడు కారు కింద పడ్డాడు. అయితే డ్రైవర్ కారును ఆపలేదు. కారు కింద పడిన సుజీత్‌ను సుమారు 600 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో పారిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన సుజీత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంబర్ ప్లేట్ ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో విద్యార్థి అయిన 16 ఏళ్ల బాలుడు కారు నడిపినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడైన బాల నేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కారుతో ఢీకొట్టి వ్యక్తిని కొంతదూరం ఈడ్చుకెళ్లిన బాలుడు : వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
August 27, 2025
0
Tags