ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో హిందాల్కో సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. కుప్పంలో రూ. 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ యాపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగించే విడి భాగాలను కూడా తయారు చేయనున్నారు. సచివాలయంలో గురువారం రోజున సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రూ. 53,922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అందులో హిందాల్కో సంస్థ పెట్టుబడి కూడా ఉంది. కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 586 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, 613 మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. ఆ ప్లాంట్ నుంచి 2027 మార్చి నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కేవలం అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాకుండా, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఛాసిస్ (బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఐ ఫోన్లు ఇండియా నుంచి భారీగా ఎగుమతి అవుతున్నాయి. బెంగళూరు సమీపంలో ప్లాంట్ కూడా ప్రారంభమయింది. కుప్పం కూడా బెంగళూరుకు 120 కి.మీ దూరంలోనే ఉంటుంది. అందుకే అక్కడ ప్లాంట్ పెట్టాలని హిందాల్కో నిర్ణయించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో అల్యూమినియం, రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. కేవలం భారతదేశానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా హిందాల్కో వ్యాపార కార్యకలాపాలు అనేక దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు ఈ సంస్థ కీలకమైన ఉత్పత్తులను అందిస్తుంది. లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. కుప్పంలో ఏర్పాటు చేయబోయే హిందాల్కో ప్లాంట్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో ఒక కీలకమైన భాగం అయ్యే అవకాశం ఉందని పారిశ్రామిక కవర్గాలు చెబుతున్నాయి.
కుప్పంలో అల్యూమినియం ఎక్స్ ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న హిందాల్కో
August 29, 2025
0
Tags