హమాస్ సీనియర్ నేత, మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరన్ కమాండ్ నాయకత్వంలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్ బలగాలు ధ్రువీకరించాయి. మూసా హమాస్ సైనిక నియంత్రణ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ దళాలు, పౌరులపై దాడుల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో హమాస్ సైనికులకు శిక్షణ ఇచ్చేవాడు. హమాస్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్‌కు సన్నిహిత అనుచరుడిగానూ కొనసాగాడని ఐడీఎఫ్ పేర్కొంది. రఫా బ్రిగేడ్‌కు సైనిక నిఘా, పరిశీలన నెట్‌వర్క్‌లకు సైతం మూసా అధిపతిగా పని చేశాడని ఐడీఎఫ్ తెలిపింది. అతడి మృతితో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు, సామర్థ్యాలు మరింత బలహీనపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌పై ప్రయోగించడానికి హమాస్ సిద్ధం చేసి, భద్రపరిచిన రాకెట్లు ఉన్న భవనాలను అతడి మరణానికి ముందు రోజు తమ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయని వెల్లడించింది. గాజా అంతటా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా భూ, వైమానిక దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 61,700లపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ పౌరులకు ఆహార సరఫరా, ఇతర సహాయం అందకుండా ఇజ్రాయెల్ పలు సంస్థలను అడ్డుకుంటున్నట్లు ఆరోపించింది. ప్రజలకు తగిన సహాయం అందించాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను కోరింది. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మృతి
August 15, 2025
0
Tags