జనసేన కేంద్ర కార్యాలయం వద్ద ప్రత్యక్షమైన తెలంగాణ మంత్రులు

Telugu Lo Computer
0


తెలంగాణ డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రులు ఇవాళ ఉన్నట్లుండి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. దీంతో వీరిని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసారు. అంతే కాదు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కానుకల్ని కూడా వారికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఇవాళ మంగళగిరి వద్ద ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి వచ్చారు. అయితే వీరి హెలికాఫ్టర్ మంగళగిరిలో దిగేందుకు సమీపంలో హెలిప్యాడ్ లేకపోవడం, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ కోసం నిర్మించిన హెలిప్యాడ్ ఉండటంతో వారు జనసేన వర్గాల్ని సంప్రదించారు. పవన్ కళ్యాణ్ తరఫున తెలంగాణ ఉపముఖ్యమంత్రి, మంత్రులకు ప్రభుత్వ విప, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగగానే వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులకు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి ఆ పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. తిరుగు ప్రయాణంలో వీరితో పాటు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వీరికి జత కలిశారు. దీంతో మంత్రులంతా జనసేన ఆతిథ్యానికి ముగ్ధులై అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో రాజకీయంగా అంత ప్రాధాన్యం లేదని జనసేన నేతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)