ధర్మస్థలలో వందలాది శవాలను తాను ఖననం చేశానని చెప్పిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు 'భీమ' చూపించిన కొత్త ప్రదేశంలో ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వకాలు జరిపారు. బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టకు 200 మీటర్ల దూరంలో వర్షం మధ్యలోనే తవ్వకాలు జరిగాయి. హిటాచి ఉపయోగించి, పైన ఉన్న మన్నును తొలగించి, ఆ తర్వాత కార్మికులతో తవ్వకాలు సాగించినా ఫలితం లేకపోయింది. తాను చూపించిన 13వ ప్రాంతంలో 8 మృతదేహాలను ఖననం చేశానని భీమ ఇప్పటికే ప్రకటించాడు. అక్కడ రాడర్ సాయంతో మృతదేహాలు, అవశేషాలు ఉన్నాయా లేదా అని గుర్తించాలని 'సిట్' నిర్ణయించింది. బెంగళూరు నుంచి జీపీఆర్ పరికరం ధర్మస్థలకు సోమవారం సాయంత్రానికి చేరుకుంది. ఆ పరికరం భూమిలో ఉన్న అవశేషాలు, వస్తువులను గుర్తించి, డిజిటల్ తెరపై చిత్రాలను చూపిస్తుంది. దాని ఆధారంగా తవ్వకాలు కొనసాగిస్తామని సిట్ అధికారి ఎంఎన్ అనుచేత్ తెలిపారు. రత్నగిరి బెట్ట పక్కన పలు ప్రాంతాల్లో కొత్తగా మట్టి తీసుకువచ్చి పోసినట్లు దర్యాప్తు దళం గుర్తించింది. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, ఇక్కడ మట్టి పోయించవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ తహసీల్దారుకు 'సిట్' నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి సరైన వివరణ రాకపోతే కేసు నమోదు చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మట్టి పోసిన విషయం తన దృష్టికి రాలేదని ఆ అధికారి బదులిచ్చినట్లు ప్రాథమిక సమాచారం. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు అడుగుపెట్టారు. బెళ్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పదంగా మరణించిన విద్యార్థిని సౌజన్య, కనిపించకుండా పోయిన అనన్య భట్, పద్మలత కుటుంబ సభ్యులు వారిని కలిసేందుకు ప్రయత్నించారు.
దర్మస్థలలో రాడార్ సాయంతో వేట !
August 12, 2025
0
Tags