తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ లకు సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు. వారి క్రమశిక్షణ, పనితనం, కట్టుదిట్టమైన విధానాలు ప్రభుత్వానికి నమ్మకాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వారిని ఇతర విభాగాల్లోనూ అవకాశం ఇవ్వాలని సంకల్పించారు. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, హెచ్‌ఎండీఏలలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ ఉద్యోగాలలో నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీలో 25 ఉద్యోగాలు, ఆర్టీసీలో 20 ఉద్యోగాలు ప్రస్తుతానికి ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఈ పథకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం, దశలవారీగా ప్రైవేట్ రంగం - ముఖ్యంగా ఐటీ కంపెనీలలో సెక్యూరిటీ విభాగంలో కూడా ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో, వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ప్రత్యేక శిక్షణ అందించి, ప్రొఫెషనల్‌గా తయారు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల ట్రాన్స్‌జెండర్లు కేవలం ఉపాధి పొందడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి భిక్షాటన, వినోదరంగంలో మాత్రమే అవకాశాలు అనే ముద్రను చెరిపేసే ప్రయత్నమని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు
August 21, 2025
0
Tags