జస్టిస్ యశ్వంత్ వర్మపై లోక్‌సభ సభలో అభిశంసన ప్రక్రియ

Telugu Lo Computer
0


భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన  ప్రక్రియను లోక్‌సభ అధికారికంగా ప్రారంభించింది. ఈ అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలో అధికారికంగా చదివి వినిపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన స్థితిలో భారీ మొత్తంలో నగదు కట్టలు లభించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2024 మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ ప్రభుత్వ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది కాలిన కరెన్సీ నోట్ల గుట్టలు కనిపించాయి. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. సంబంధిత ఘటనపై న్యాయ విచారణ జరపగా.. ఆ నగదు మీద జస్టిస్ వర్మకు "రహస్య లేదా క్రియాశీలక నియంత్రణ" ఉందని తేల్చినట్లు నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే విచారణ నివేదిక ఆధారంగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలంటూ సిఫార్సు చేశారు. దీన్ని అనుసరించి, మాజీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు లోక్‌సభ నుంచి 146 మంది, రాజ్యసభ నుంచి 63 మంది సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన తీర్మాన నోటీసు జులై 31న స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించబడింది. కాగా ఈరోజు లోక్ సభలో ఈ తీర్మానాన్ని అధికారికంగా చదివి వినిపించారు స్పీకర్. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించి, నిబంధనల ప్రకారం ఈ తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నాను. ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. జడ్జిల విచారణ చట్టం-1968 ప్రకారం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో  సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.వి. ఆచార్య సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక సమర్పించేంత వరకు తీర్మానం పెండింగ్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవ దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అంతర్గత విచారణ నివేదికను సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, గత వారం సుప్రీం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. "విచారణ ప్రక్రియ పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా జరిగింది" అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో సిట్టింగ్ జడ్జిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. గతంలో 1991లో జస్టిస్ రమేశ్ చందర్, 2011లో జస్టిస్ సౌమిత్ర సేన్‌పై ఇలాంటి చర్యలు ప్రారంభమైనప్పటికీ, ప్రక్రియ పూర్తి కాకముందే వారు రాజీనామా చేశారు. అయితే కమిటీ ఆరోపణలు నిజమని తేలిస్తే ఈ తీర్మానం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో (సభలో హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండొంతుల మంది, సభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ) ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సదరు న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)